Wednesday, October 20, 2010

friend

స్నేహం

స్నేహం విశిష్టమైన, విలక్షణమైన భావన. మానవ జీవితంలో సమస్త కాలాల్లో మనిషి మనిషికీ మధ్య ఉండవలసిన అత్యంత అవసరమైన లక్షణం ఈ స్నేహం. నిజమైన మిత్రుల మధ్య కృతజ్ఞత, త్యాగం వంటి మహోత్కృష్ట లక్షణాలు ఎప్పుడూ పరిమళిస్తూనే ఉంటాయి. 'యాదృచ్ఛికంగా అన్నదమ్ములవుతారు. స్నేహబంధాలను మనిషిహృదయం సృష్టించుకుంటుంది' అని ఆంగ్లసూక్తి. స్నేహం హృదయంలో పుట్టేది గనుక సౌహార్దం అన్నారు. మనసా వాచా కర్మణా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవితంలోని కష్టనష్టాలను సమానంగా పంచుకోవడాన్ని స్నేహధర్మంగా భావిస్తారు.

తనకు ఉన్నదాన్ని మిత్రునికి ప్రేమతో ఇవ్వాలి. మిత్రుడు స్నేహంతో ఇచ్చినదాన్ని పరిగ్రహించాలి. తన మనసులోని మాటను అతడికి చెప్పాలి. అతడి మనసులో ఉన్న భావాన్ని అడిగి తెలుసుకోవాలి. అతడు ఆహ్వానిస్తే అతని ఇంట్లో భోజనం చేయాలి. తన ఇంట్లో అతనికి భోజనం పెట్టాలి. ఈ ఆరు లక్షణాలూ ఆ ఇద్దరి మధ్య స్నేహబంధాన్ని పెంచి కష్టసుఖాల్లో ఒకరిని ఒకరు ఆదుకునేటట్లు చేస్తాయని ఆర్యోక్తి.

స్నేహం దివ్యమైన ఔషధం వంటిది. మంచి సహవాసం వల్ల బుద్ధి వికసిస్తుంది. మనసులోని మాలిన్యం తొలగిపోతుంది. క్లేశమైన మనస్సు తేలిక పడుతుంది.

స్నేహం అంటే నూనె అని అర్థం. నూనె, ప్రమిద, వత్తిల మధ్య స్నేహంవల్లనే దీపం వెలుగుతుంది. స్నేహం మధురమైన అనుభూతి. పశుపక్ష్యాదుల్లో కూడా ఉండే స్నేహబంధాన్ని పంచతంత్రం కథలు చెబుతున్నాయి.

శ్రీరామ సుగ్రీవుల స్నేహం లోకోత్తరమైనది. కష్టకాలంలో ఉన్నప్పుడు ఇరువురికీ స్నేహం కుదిరింది. హనుమంతుడి సమక్షంలో రెండు కాష్ఠాలు తెచ్చి మండుతున్న అగ్నిలో పేల్చి పూలతో అర్చించి ఉభయులూ ప్రదక్షిణ చేశారు. సుగ్రీవుడు రాముడితో- 'నీవు నాతో స్నేహం చేయదలచుకుంటే... ఇదిగో నా స్నేహహస్తం' చేయి కలిపాడు. ఇరువురూ తమ సమస్త శక్తులను ధారవోసి ఒకరికొకరు సహాయంచేసుకున్నారు.

మహాభారతంలో కర్ణదుర్యోధనులది అపూర్వమైన స్నేహం. కర్ణుని అంగరాజుగా చేసి స్నేహం అన్న మాటకు గొప్ప విలువను ఇచ్చాడు సుయోధనుడు. పాండవులు తన సోదరులని తెలిసినా ప్రలోభాలకు లోనుకాకుండా తుదిదాకా మిత్రుడికోసం పోరాడి ప్రాణాలు త్యజించిన ఆదర్శ స్నేహితుడు కర్ణుడు. కృష్ణ కుచేలురదీ చక్కని స్నేహబంధమే. సాందీపని శిష్యులుగా ఉన్ననాటి మైత్రిని విస్మరించక- సుదాముడు ఏమీ కోరకుండా వెనుదిరిగినా కృష్ణుడు అతనికి సకల ఐశ్వర్యాలు ప్రసాదించాడు.

మంచి మిత్రులు పరస్పరం క్షీర నీర న్యాయంలా ఉంటారని భర్తృహరి సుభాషితం. మన జీవితంలోని అన్ని సంఘటనల్లోనూ తోడుగా ఉంటాడు మంచి స్నేహితుడు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న దశలో మంచి స్నేహపు అనుభూతులు వర్షపు చుక్కల్లాంటివి. మట్టికి పరిమళాన్ని, విత్తుకు మొలకెత్తే శక్తిని వానచుక్క ఇవ్వగలిగినట్లు- స్నేహితుడు తన సహచరునికి జీవించే శక్తి ఇస్తాడు!

No comments:

Post a Comment